Showing posts with label Reviews. Show all posts
Showing posts with label Reviews. Show all posts

Saturday, August 22, 2026

"దాబా హోటల్ " తెలుగు నవల

 దాబా హోటల్ అనే నవల చదివిన తర్వాత ఈ రెండు మాటలు పంచుకోవాలనిపించింది.ఉషా-వెలగపూడి స్మారక నవలల పోటీలో ఈ నవల ప్రథమ బహుమతి పొందింది.రచయిత శిరంశెట్టి కాంతారావు గారు.ఈ నవల చదవడం మొదలుపెట్టగానే దించకుండా ఏకబిగిన చదవడం జరిగింది.ఈమధ్య కాలం లో ఇలా నాచేత చదివించిన రచనలు బహు అరుదు. తెలుగు నవల లో ఇంతవరకు నాకు ఎక్కడా తారసపడని ఇతివృత్తాన్ని తీసుకున్నారు. తీసుకోవడమే కాదు ఆ విషయాన్ని లోతుగా పరిశోధించారు. కేవలం పరిశోధించడం మాత్రమే కాదు దాన్ని జవజీవాలతో సమకాలీన వాస్తవ మానవ జీవితాలతో ముడివేశారు.

ఇది కల్పితం కాదు.మనం విజయవాడ-రాయ్ పూర్ జాతీయ రహదారి మీదుగా ప్రయాణిస్తుంటే పాల్వంచ అనే పారిశ్రామిక పట్టణం తగులుతుంది.అక్కడ రహదారి కి పక్కన ఉన్న దాబా హోటళ్ళు కనబడతాయి. సాయంత్రం నుంచి కళకళ లాడుతూ కనిపించే ఈ హోటళ్ళ వెనుక ఉన్న చరిత్ర ని,ఆ చరిత్ర నిర్మించిన హరిభజన్ సింగ్ జీవిత సమరాన్ని ఈ నవల చిత్రించింది. అభిరుచి ఉన్న చిత్ర దర్శకుడు ఈ నవల గనక చదివితే చక్కని విన్నూత్నమైన సినిమా తీయగలడనిపించింది.బిచ్చం అనబడే ఒక తండా లోని బాలుడు ఇంటి వద్ద ఆదరణ కరువై , ఒక పంజాబీ లారీ డ్రైవర్ ద్వారా నాందేడ్ లోని గురుద్వారా కి చేరుకోవడం ,అక్కడ గురుసేవ లో భాగంగా  రొట్టెలు తయారీ లో ఫాల్గొంటూ తన జీవన విధానాన్ని మలుచుకోవడం ఆసక్తి గా సాగుతుంది.

ఈ నవల లో సిక్కు మత సంప్రదాయాలు,ఆచార వ్యవహారాలు చక్కగా వివరించారు.బిచ్చం సిక్కు మతం లో చేరతానని అన్నప్పుడు తల్లిదండ్రుల అనుమతి తీసుకొని రమ్మని ప్రధానగ్రంథీ పంపించడం , రోజువారీ సిక్కు మతస్తుని జీవితం సాగే విధానం ఆకట్టుకుంటాయి.బాలుడు గా ,యువకునిగా,తండ్రిగా బిచ్చం అనబడే హరిభజన్ సింగ్ జీవితం సాగే వైనం మనకి అనేక కొత్త సంగతులు తెలుపుతాయి.అదీగాక ఇదంతా కూడా ఇది నిజంగా ఇప్పటికీ నిలిచి ఉన్న దాబా హోటళ్ళ పునాది యొక్క చరిత్ర అని తెలుసుకున్నప్పుడు మరింత ఉత్సూకత కలుగుతుంది.నూతనత్వాన్ని కోరుకునే  ప్రతి తెలుగు పాఠకుడు ఈ నవలని తప్పక చదవాలి.

దాబా హోటల్ (నవల)

పేజీలు:151

వెల:రూ.150/-   

ప్రతులకు ; 98498 90322


--- Reviewd by Murthy Kvvs