Sunday, September 20, 2026

ఆదివాసీ హక్కుల పరిరక్షణ కోసం

 

భద్రాచలం ఆదివాసీ సమితి (BAS), ఆదివాసీ మహిళా చైతన్య శక్తి ఆధ్వర్యంలో *భద్రాచలం అల్లూరి సీతారామరాజు కాలనీలోని శ్రీ సమ్మక్క సారలమ్మ దేవాలయంలో* ఆదివాసీ హక్కుల కోసం నిర్వహించనున్న ధర్నాను విజయవంతం చేయాలని కోరుతూ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా గుడి పెద్దలు *తాటి రుక్మిణి, సోడే సావిత్రి, జారే భద్రమ్మ, యాప బుజ్జమ్మ* ప్రత్యేక ఆదివాసీ సంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహించి, ఆదివాసీ మార్చ్‌, ధర్నా విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

*రేపు (సెప్టెంబర్ 21) తెలంగాణ రాష్ట్ర తుడుం దెబ్బ అధ్యక్షుడు డాక్టర్ మైపతి అరుణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో* భద్రాచలం *బ్రిడ్జి సెంటర్ నుంచి PO ITDA కార్యాలయం వరకు ఆదివాసీ మార్చ్, ర్యాలీ అనంతరం ధర్నా* నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు.

ఈ సందర్భంగా ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ *ఆదివాసీల హక్కులు, భూమి–అటవీ హక్కుల పరిరక్షణతో పాటు 1/70 చట్టం, PESA చట్టం, షెడ్యూల్డ్ ఏరియా చట్టాలు, అటవీ హక్కుల చట్టం–2006 సమర్థవంతంగా అమలు చేయాలని* డిమాండ్ చేశారు.

అలాగే *ఆదివాసీ అభివృద్ధికి కీలకమైన ITDAలను మరింత పటిష్టపరచాలని, ITDA పరిధిలోని ఉద్యోగాలను ITDA ద్వారానే భర్తీ చేయాలని*, విద్య, వైద్యం, రహదారులు, మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.

*“ఆదివాసీ హక్కులు – ఆదివాసీల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా కదలాలి. సెప్టెంబర్ 21న జరిగే ఆదివాసీ మార్చ్‌, ధర్నాలో ఆదివాసీ ప్రజలు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలి”* అని నాయకులు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో *కొండ్రు సుధారాణి, కుంజా సంతోష్, కొర్సా చినబాబు దొర, వీసాల కృష్ణయ్య, కణితి రాధ, వీసాల ఉమాదేవి, మిడియం నాగమణి, శీలం దుర్గ, కెచ్చెల భవానీ, శీలం రాజారావు, సోయం మంగవేణి, ఉయిక వెంకటలక్ష్మి, సవలం రాధ, సవలం దుర్గ, అట్టం కమల* తదితర ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Thanks for your visit and comment.