Tuesday, August 25, 2026

ఆదివారం ఉదయం శ్రీకాకుళంలో ...

  (23-8-26) ఆదివారం ఉదయం శ్రీకాకుళంలో అట్టాడ అపల్నాయుడు గారి 74వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని వారి బంధుమిత్రుల సమక్షంలో వారి స్వగృహంలో చిన్నపాటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. 

ఆ కార్యక్రమానంతరం అందరం కలిసి పట్టణంలోని యు.టి. యఫ్. భవన్ లో పలువురు సాహితీవేత్తలు, సాహిత్యాభిమానుల సమక్షంలో వారి ఇటీవలి రచన ‘తంపర’ వ్యాస సంపుటి ఆవిష్కరణ జరిగింది. 


తదనంతరం కళింగాంధ్రకే చెందిన మరో సుప్రసిద్ధ కవి, గాయకుడు, కథకుడు, వ్యాసకర్త, విశ్రాంత ఉపాధ్యాయుడు అయిన శ్రీ గంటేడ గౌరునాయుడు పార్వతీపురం గారు నేను కలిసి సంయుక్తంగా వెలువరించిన ‘అనేక ఉదయాలు - రెండు హృదయాలు’ అనే సరికొత్త రచనా సంవిధాన ‘వారధి’ పుస్తకాన్ని కూడా ఆవిష్కరించడం జరిగింది. 

 ఈ “అనేక ఉదయాలు - రెండు హృదయాలు” వెలువరింతలో విశేష కృషిచేసిన చిరంజీవులు గంటేడ క్రాంతి మరియు ఉపాధ్యాయుడు, కేంద్రసాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత అయిన బాలసుధాకరమౌళిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు కుంటున్నాము.

సభలో పార్వతీపురం నుండి గౌరునాయుడు గారితో పాటు మల్లిపురం జగదీష్, సిరికి స్వామినాయుడు, చింతా అప్పలనాయుడు, పక్కి రవీంద్రనాథ్ తదితరులు, 

విజయనగరం నుండి సాహితీ స్రవంతి రాష్ట్రభాద్యులు శ్రీచీకటి దివాకర్ గారు వారి శ్రీమతి చంద్రికారాణి గార్లు కూడా వచ్చారు.

విశాఖపట్నం నుండి కవి, గాయకుడు, నటుడు అయిన సాంబమూర్తి, కవి, కథకుడు వెంకట్ గార్లు కూడా వచ్చారు. 

స్థానిక శ్రీకాకుళం వాసులైన అనేక మంది కవులు, కథకులు, విమర్శకులు, సాహితీ వేత్తలు, సాహితీ శ్రేయోభిలాషులు విచ్చేసి మూడు గంటలపాటు కొలువుదీరి సభను దిగ్విజయంచేసి, సాహిత్యం పట్ల వారికున్న మక్కువను వెల్లడించారు. 

విశ్రాంత ప్రధానోపాధ్యాయులు, కథకులు అయిన శ్రీ దాసరి రామచంద్రరావు గారు సభాధ్యక్షులుగా ఆద్యంతం సమయపాలనను పాటిస్తూ ఎంతో నేర్పుగా సభను విజయవంతంగా నడిపించారు.

సభలో సర్వశ్రీ నల్లి ధర్మారావు, సిరికి స్వామినాయుడు, పక్కి రవీంద్ర, చింతా అప్పలనాయుడు గార్లు ఆత్మీయ భాషణం చేశారు. 

అలాగే సభలో తన గానంతో చింతాడ రామచంద్రరావు, డప్పుతో డప్పు శ్రీను గార్లు ఆహూతులను ఉర్రూతలూగించారు.

ముఖ్య అతిథులుగా కళింగసీమలో సాహిత్య ప్రచురణలు వెలువరిస్తున్న  చిగిలిపల్లి ప్రభాకర్ రావు మాష్టారు, చీకటి దివాకర్ గార్లు పాల్గొన్నారు. 

‘తంపర’ వ్యాస సంపుటిని  సాహితీ స్రవంతి శ్రీనివాస్, 

‘ఎన్నో ఉదయాలు

రెండు హృదయాలు’ పుస్తకాన్ని ప్రముఖ వైద్యులు డాక్టర్ సుధీర్ గార్లు ఆవిష్కరించారు.

బహుకాలం గుర్తుండిపోయే సాహితీ వ్యాసంగంలోను, సాహితీసభలోనూ కూడా నేను భాగస్వామినైనందుకు ఎంతో సంతోషిస్తున్నాను. 

-- శిరంశెట్టి కాంతారావు

1 comment:

  1. చక్కని సాహితీ కార్యక్రమం

    ReplyDelete

Thanks for your visit and comment.