Wednesday, August 12, 2026

శ్రమజీవన సౌందర్యం

 సోమవారం ఉదయం మాదంపతులం ఇరువురం హన్మకొండ నుండి మా పెద్దమ్మాయి, అల్లుడు వాళ్ళతో కలిసి కారులో హైదరాబాద్ వెళుతూ మార్గమధ్యంలో పెంబర్తి ఊరిబయట వున్న హోటల్ ఆర్.ఆర్.లో కాఫీ, ఫలహారాలకోసం ఆగాము. 

పై ఫొటోలో కన్పిస్తున్న వ్యక్తి 

ఆ హోటల్ ముందు ట్రాపిక్ కంట్రోలర్ &  సెక్యూరిటీగార్డ్ కూడా పనిచేస్తూ కనిపించాడు. అతణ్ణి గమనించిన నేను వెంటనే నాకు పెసరట్టు కావాలని చెప్పి,అది వచ్చేలోపు అతని దగ్గరికెళ్ళి ముచ్చట పెట్టాలనుకున్నాను. వెళ్ళి పలకరించాను. 

తన పేరు నాగయ్య. ఊరు పెంబర్తి సమీపగ్రామమైన మాణిక్యపురం  వాళ్ళ స్వగ్రామమట. వాళ్ళు రజక సామాజికవర్గానికి చెందినవారట. తన వయసు యాభై తొమ్మిదో, అరవై ఏండ్లో వుంటాయట. తను చదువుకోలేదట. నాగయ్య దంపతులకు సంతానంలేదట. ఉండటానికి స్వంత ఇల్లు తప్ప వేరే ఆస్తిపాస్తులేమీ లేవట. ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరేవుంటార. 

“మరి సంతానం కలిగేఅవకాశం లేనప్పుడు ఏ అనాథబిడ్డనో తెచ్చుకుని సాదుకోపోయారా?”

అంటూ అడిగాను. దానికతను “దేవుడే మానొసటన సంతుకలగాలని రాయనప్పుడు  మళ్ళా అటువంటి ప్రయత్నాలెందుకులెమ్మని వద్దనుకున్నాము” అంటూ బదులిచ్చాడు నాగయ్య. 

“మరి వృద్దాప్యంలో ఎలా” అంటూ అడిగితే “ఈరోజుల్లో కొడుకులు, బిడ్డలున్నోళ్ళందరికీ ముసలి తనంలో పిల్లలు బువ్వబెట్టి మంచి చెడ్డ చూసుకుంటరా? అట్లా  నమ్మేరోజులెప్పుడోపోయినై. 

మా ఆలుమగలిద్దరం ఒకరికొకరం పిల్లలం. మా కాళ్ళు రెక్కలే మా ఆస్తిపాస్తులు. ఎవరం ముందో? ఎవరం ఎనకో ఎవరికెరుక? ముందు పొయినోళ్ళం అదృష్టవంతులం.  ఎనక పోయి నోళ్ళను  ముందలబడి ఎవడు మట్టిల కప్పెడతడో? వాడే వున్న ఇల్లు తీసుకుంటాడు” అంటూ భవిష్యత్తు పట్ల తమ దంపతుల ఆలోచన ఏంటో నింపాదిగా చెప్పుకొచ్చాడు. 

వాళ్ళ ఊర్లో సుమారు రెండవందల మందిదాకా చాలా ఏండ్లుగా ఉప్పర పని మీదనే బతుకులు ఎల్లదీస్తున్నారట! నాగయ్య దంపతులుకూడా మొదటి నుండి వాళ్ళతోపాటు 

ఆ ఉప్పర పన్లకు వెళ్ళేవారట. 

రాను రానూ ఆపని కష్టంగా అనిపించడంతో ఐదు మాసాల క్రితం ఈ హోటల్లో ఆలుమగలిద్దరూ నెలజీతాలకు కుదిరారట. వాళ్ళావిడ క్లీనర్ గా చేస్తుంది.

ఆహోటల్ ఉదయం ఐదు గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కేవలం కాఫీ, ఫలహారాలను మాత్రమే సర్వ్ చేస్తుందట. ఒంటి గంట తర్వాత క్లోజ్ ఐపోతుందట.

దాంతో స్టాప్ అందరితోపాటు వాళ్ళూ ఇంటికి వెళ్ళిపోతారట.

హోటల్ వాళ్ళు ఇద్దరికీ ఒకపూట టిఫిన్ పెట్టి నెలకు చెరో పదివేలు ఇస్తున్నారట. ఒకరివి ఖర్చు పెట్టుకొని, ఒకరివి వెనుకేసుకుంటున్నారట!

తనింకేదో చెప్పబోతుండగా “ఫలహారం వచ్చింది” రమ్మంటూ అల్లుడు పిలవడంతో నాగయ్య దగ్గర శలవుతీసుకుని ఫలహారశాల లోపలికి వెళ్ళిపోయాను.

మిత్రులకు శ్రమజీవన సౌందర్య అవగాహనానుభవ ప్రమోదోదయం!

                                                                                         --- శిరంశెట్టి కాంతారావు



No comments:

Post a Comment

Thanks for your visit and comment.